Election Commission: ప్రపంచ రికార్డు సృష్టించిన భార‌త ఓట‌ర్లు: ఈసీ

CEC Rajiv Kumar Press Meet Details
  • ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన‌ 64.2 కోట్ల మంది భార‌తీయులు
  • రికార్డుస్థాయిలో 31.2 కోట్ల మంది మ‌హిళ‌లు ఓటు వేశారన్న‌ ఈసీ
  • హింస లేకుండా జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారన్న రాజీవ్ కుమార్‌
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ప‌ది వేల కోట్ల న‌గ‌దును సీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డి

దేశంలో ఏడు ద‌శ‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించామ‌ని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో 64.2 కోట్ల మంది భార‌తీయులు ఓటు వేయ‌డం ప్ర‌పంచ రికార్డు అని చెప్పారు. దీంతో భార‌త్ చ‌రిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఇది జీ7 దేశాలైన అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, కెన‌డా, ఇట‌లీ జ‌నాభా కంటే 1.5 రేట్లు అధికం అని తెలిపారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా మ‌న‌దేశంలో 31.2 కోట్ల మంది మ‌హిళ‌లు ఓటు వేశార‌ని రాజీవ్ కుమార్ వివ‌రించారు. 

ఇక 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేవ‌లం 39 చోట్ల మాత్ర‌మే రీపోలింగ్ జ‌రిగింద‌ని చెప్పారు. అయితే 2019లో 540 చోట్ల రీపోలింగ్ జ‌రిగింద‌ని ఈ సంద్భంగా గుర్తు చేశారు. గ‌త నాలుగు ద‌శాబ్ధాల్లో ఎన్న‌డూ లేని స్థాయిలో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌మ్మూక‌శ్మీర్‌లో అధిక స్థాయిలో ఓట‌ర్లు ఓటు వేసిన‌ట్లు సీఈసీ తెలిపారు. హింస లేకుండా జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి అన్నారు. దీని వెన‌క‌ రెండేళ్ల  ప్ర‌ణాళిక ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  

తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సుమారు 68 వేల మానిట‌రింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్, భ‌ద్ర‌తా సిబ్బంది విధులు నిర్వ‌ర్తించిన‌ట్లు సీఈసీ వెల్ల‌డించారు. 2024 ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం సుమారు నాలుగు ల‌క్ష‌ల వాహ‌నాలు, 135 ప్ర‌త్యేక రైళ్లు, 1,692 విమాన స‌ర్వీసుల‌ను ఉప‌యోగించిన‌ట్లు చెప్పారు. అలాగే ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ల‌ను 'లాప‌తా జెంటిల్మెన్' అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ చేయ‌డం ప‌ట్ల సీఈసీ స్పందించారు. తాము ఇక్క‌డే ఉన్నామ‌ని, ఎక్క‌డికీ పారిపోలేద‌ని ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ప‌ది వేల కోట్ల న‌గ‌దును సీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. డ్ర‌గ్స్‌, భారీ మొత్తంలో మ‌ద్యాన్ని కూడా సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘించిన‌ట్లు 495 ఫిర్యాదులు రాగా, వాటిలో 90 శాతం త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించిన‌ట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. టాప్ నేత‌ల‌కు కూడా నోటీసులు ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను సజావుగా నిర్వ‌హించేందుకు అనేక మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు తెలియ‌జేశారు. డీప్ ఫేక్‌, ఏఐ ఆధారిత కాంటెంట్‌ను చాలా వ‌ర‌కు నియంత్రించిన‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News