Monkey: వడదెబ్బకు గురైన వానరం.. ఓఆర్ఎస్ తాగించి కాపాడిన స్థానికులు.. వీడియో వైరల్

Ghaziabad Residents Save A Monkey Who Fell From Tree Due To Heat

  • చల్లని నీటితో ఒళ్లు తుడిచి, కూలింగ్ ఆయిల్ తో మసాజ్ చేస్తూ సపర్యలు
  • యూపీలోని ఘజియాబాద్ లో ఘటన
  • మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్ల కితాబు

దక్షిణాదిలో రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నా ఉత్తరాది ప్రాంతం మాత్రం ఇంకా భానుడి భగభగలకు భగ్గుమంటోంది. దీంతో మనుషులే కాదు.. జంతువులు సైతం అల్లాడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వానరం వడదెబ్బకు గురైంది. అయితే దానికి స్థానికులు వెంటనే సపర్యలు చేసి కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

వడదెబ్బ వల్ల కళ్లు తిరిగి ఓ ఆడ కోతి చెట్టు మీద నుంచి కిందపడి ఉండటం ఆ వీడియోలో కనిపించింది. దీంతో కొందరు వ్యక్తులు దాని వీపుపై చల్లటి నీరు పోసి ఒళ్లంతా నిమరారు. దీంతో అది కొంచెం కోలుకొని లేచి కూర్చుంది. అనంతరం మరో వ్యక్తి వానరానికి ఓఆర్ఎస్ ను తాగించేందుకు ప్రయత్నించాడు. అది వెంటనే తాగనప్పటికీ ఆ తర్వాత తాగినట్లు స్థానికులు తెలిపారు.  అలాగే కూలింగ్ ఆయిల్ తో దానికి మసాజ్ చేసినట్లు వివరించారు. స్థానికుల ప్రయత్నం ఫలించడంతో దాని ప్రాణం నిలిచింది.

మూగజీవిపట్ల మానవత్వాన్ని చాటిన స్థానికులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  ‘వేసవిలో జంతువుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అతితక్కువ మందే వాటిని పట్టించుకుంటారు. వానరాన్ని స్థానికులు కాపాడటం చూసి సంతోషిస్తున్నా’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘ప్రజలు స్థానికంగా ఎవరికి వారు మొక్కలు నాటితేనే జంతువులకు భవిష్యత్తులో ఎండల నుంచి రక్షణ లభిస్తుంది’ అని పేర్కొన్నాడు. వడదెబ్బకు గురయ్యే జంతువులను కాపాడేందుకు స్థానికులు ఎల్లప్పుడూ ముందుకు రావాలని మరొకరు కోరారు.

యూపీలో ఈ తరహా ఘటన గతంలో కూదా చోటుచేసుకుంది. కొన్ని రోజుల కిందట బులంద్ షహర్ పట్టణంలో ఓ కోతి వడ్డదెబ్బకు గురైంది. చెట్టు నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడే ఉన్న వికాస్ తొమర్ అనే కానిస్టేబుల్ దాన్ని కాపాడాడు.

  • Loading...

More Telugu News