Election Commission: రేపే ఎన్నికల కౌంటింగ్.. నేడు ఈసీ కీలక ప్రెస్‌మీట్
- పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టడం ఇదే తొలిసారి
- రెండు రాష్ట్రాల అసెంబ్లీ, 543 ఎంపీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
- ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ప్రక్రియ
లోక్‌సభ ఎన్నికలు-2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ రేపే (మంగళవారం) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కౌంటింగ్‌కు ముందు రోజైన నేడు (సోమవారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్‌మీట్ నిర్వహించేవారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత, కౌంటింగ్‌కు ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్‌సభ స్థానాలకు రేపు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ఆరంభమవనుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే కీలకమైన సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు), వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి అనుసరించాల్సిన ప్రక్రియపై సూచనలు చేసింది.