Sajjala Ramakrishna Reddy: మన ప్రత్యర్థులు దేనికైనా సమర్థులు... కౌంటింగ్ వేళ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల శిక్షణ
- కౌంటింగ్ హాల్లో ఏదైనా జరిగితే వెంటనే ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలని సూచన
ఏపీలో ఎల్లుండి (జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే, వెంటనే దాన్ని ఎత్తి చూపాలని, ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలని సజ్జల స్పష్టం చేశారు.
ఏదైనా జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి, ఆ తర్వాత ఎన్ని చేసినా ఉపయోగం ఉండదని, కౌంటింగ్ హాల్లో తప్పు జరిగితే అక్కడిక్కడే అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అవసరమైతే ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని, ఎవరి బాధ్యత వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తే నికార్సయిన ఫలితాలు బయటికి వస్తాయని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అని తెలిపారు. ప్రజలు వేసిన ఓటుకు న్యాయం జరగాలంటే కౌంటింగ్ ఏజెంట్లు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని సజ్జల పిలుపునిచ్చారు.
మన రాష్ట్రంలో వ్యవస్థల్లో కూడా చొరబడి మేనేజ్ చేయగల ప్రత్యర్థులు ఉన్నందున వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సజ్జల స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో పోటీ తీవ్రంగా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి కుట్రలకైనా పాల్పడే ప్రత్యర్థులు ఉన్నారని వివరించారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు ఉన్న వారిని ఎదుర్కొంటున్నామని వ్యాఖ్యానించారు.