Phone Tapping Case: ఆయనకు మతిభ్రమించినట్టుంది: కోమటిరెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

Harish Rao counters minister Komatireddy allegations

  • ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
  • అమెరికా వెళ్లింది ప్రభాకర్ రావును కలిసేందుకేనని ఆరోపణ
  • ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకేసి రాస్తానన్న హరీశ్ రావు
  • చర్చకు రావాలంటూ మంత్రి కోమటిరెడ్డికి సవాల్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్టుగా అనిపిస్తోందని అన్నారు. వెంటనే వెళ్లి డాక్టర్ కు చూపించుకుంటే మేలని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"నేను అమెరికా వెళ్లి రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావును కలిశానని ఆరోపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా? సీఎం, ఆయన మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనడానికి ఇదే నిదర్శనం. 

నేను ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లాను... అందులో అబద్ధమేమీ లేదు. కానీ, ప్రభాకర్ రావును కలిశానని కోమటిరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి... నేను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే హైదరాబాదులో అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకేసి రాస్తాను. తన ఆరోపణలు నిరూపించుకోకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతారా? 

ఈ అంశంపై ఎక్కడ చర్చించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అమెరికాలో ఎక్కడికి వెళ్లాను, ఏ హోటల్ లో దిగాను? అనే వివరాలతో పాటు పాస్ పోర్టు స్టాంపింగ్ వివరాలతో సహా నేను చర్చకు వస్తాను... మంత్రి కోమటిరెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలతో చర్చకు వస్తారా? టైమ్, డేట్ కోమటిరెడ్డి చెప్పాలి" అంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News