Chandrababu: రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు: చంద్రబాబు

Chandrababu says ten years completed for two Telugu states

  • 2014 జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
  • ఇవాళ జూన్ 2
  • రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని చంద్రబాబు ఉద్ఘాటన
  • 2047 నాటికి తెలుగుజాతి నెంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్ష

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇవాళ జూన్ 2వ తేదీ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అని అన్నారు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే అని ఉద్ఘాటించారు. 

"10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. 

పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి....సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి" అని చంద్రబాబు ఆకాంక్షించారు. 

భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలని, అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News