T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్: తొలి మ్యాచ్‌లో కెనడాపై అమెరికా రికార్డు విజయం

Aaron Jones powers USA to stunning win in WC opener

  • మొదలైన టీ20 ప్రపంచకప్
  • తొలి మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసిన యూఎస్ఏ
  • మొదటి మ్యాచ్‌లోనే రికార్డులు
  • 40 బంతుల్లో 94 పరుగులు చేసిన యూఎస్ఏ ఆటగాడు అరోన్ జోన్స్

టీ20 ప్రపంచకప్ సమరాంగణం మొదలైంది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో యూఎస్ఏ-కెనడా జట్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోర్లు నమోదు కాగా, అమెరికా 7 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. నవ్‌నీత్ ధనీవాల్ (61), నికోలస్ కిర్టన్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. అరోన్ జాన్సన్ 23, శ్రేయాస్ మొవ్వ 32 పరుగులు చేశారు.

అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్  ప్రారంభించిన యూఎస్ఏ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అరోన్ జోన్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, అండ్రీస్ గౌస్ 65 పరుగులు చేసి జట్టుకు రికార్డు విజయాన్ని అందించిపెట్టారు. 

యూఎస్ఏ క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. అంతేకాదు, ప్రపంచకప్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన మూడో జట్టుగానూ యూఎస్ఏ రికార్డులకెక్కింది. అరోన్ జోన్స్ ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.  

  • Loading...

More Telugu News