Jogi Ramesh: చంద్రబాబు ఏ దేశం వెళ్లాడు... ఏ దేశం నుంచి తిరిగొచ్చాడు?: ఏపీ మంత్రి జోగి రమేశ్
- చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో తెలియదన్న జోగి రమేశ్
- 10 రోజుల తర్వాత శంషాబాద్ లో దిగాడని వెల్లడి
- ఎల్లో మీడియా పత్రికల్లో తలోరకంగా రాశారని
ఏపీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడో తెలియదు కానీ, 10 రోజుల తర్వాత తిరిగొచ్చాడని... అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్లాడు, ఏ దేశం నుంచి తిరిగొచ్చాడు? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు బయల్దేరి వెళ్లాడు. దుబాయ్ లో దిగాడనేది ఒక సమాచారం. మరి దుబాయ్ నుంచి 10 రోజుల పాటు ఏ దేశానికి వెళ్లాడు? చంద్రబాబు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లాడని ఒక ఎల్లో మీడియా పత్రికలో రాశారు. మరో ఎల్లో మీడియా పత్రికలో ఏమో... ఎన్నికలతో తలమునకలైన చంద్రబాబు సేదదీరేందుకు విదేశాలకు వెళ్లాడని రాశారు.
సరే... చంద్రబాబు తిరిగొచ్చారు... ఫలానా దేశం నుంచి తిరిగొచ్చినట్టు ఆ పత్రికల్లో రాశారా అంటే అదీ లేదు! కానీ, ఏ దేశం నుంచి వచ్చాడో కానీ చంద్రబాబు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు... ఏమిటింత రహస్యం? ఆ పర్యటన వివరాలు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతున్నా! దిక్కుమాలిన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడన్నది రాష్ట్ర ప్రజల్లోనూ ఆసక్తి ఉంది.
మేం ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ సోషల్ మీడియా మేం ఇన్నిసార్లు అడుగుతున్నా ముందుకు రావడం లేదేంటి? చంద్రబాబు ఏ దేశం వెళ్లాడో తెలియదు, వైద్య పరీక్షల కోసం వెళ్లాడో, సేదీరేందుకు వెళ్లాడో కూడా తెలియదు. లేకపోతే, పెట్టుబడులు ఆకర్షించడం కోసం వెళ్లాడో తెలియదు, పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్లాడో తెలియదు.
నల్లధనం అంతా తీసుకెళ్లి ఏ దేశంలో అయినా పెట్టాడేమో అది కూడా తెలియదు. దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో అయినా దాచాడేమో అది కూడా తెలియదు" అంటూ జోగి రమేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.