Virat Kohli: అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు: విరాట్ కోహ్లీ
![Never thought we would be playing cricket in any form in the United States says Virat Kohli](https://imgd.ap7am.com/thumbnail/cr-20240601tn665adbb036791.jpg)
- మొదటిసారి టీ20 ప్రపంచకప్‌కు యూఎస్ ఆతిథ్యం
- నేటి నుంచి జూన్ 29 వరకు టోర్నీ
- ఇప్పటికే మెగా ఈవెంట్ కోసం అమెరికాలో దిగిన టీమిండియా
- తాజాగా జట్టుతో చేరిన విరాట్ కోహ్లీ
- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న వైనం
అమెరికా 2024 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తో కలిసి ఆతిథ్యమిస్తూ తొలిసారి ఇందులో భాగస్వామ్యం అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చేరువ కావాలనే లక్ష్యంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నేటి (శనివారం) నుంచి జూన్ 29వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇక వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న యునైటెడ్ స్టేట్స్ తన తొలి మ్యాచ్‌ను ఇవాళ (జూన్ 1న) డల్లాస్ వేదికగా కెనడాతో ఆడనుంది.
అయితే, ఈ మెగా ఈవెంట్‌లో కీలక పాత్ర పోషించనున్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా రన్‌మెషీన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తానెప్పుడూ అమెరికా వేదికగా క్రికెట్ ఆడతామని ఊహించలేదన్నాడు.
"నిజం చెప్పాలంటే, యునైటెడ్ స్టేట్స్‌లో అసలు క్రికెట్ ఆడతామనే ఊహించలేదు. కానీ, అది ఇప్పుడు జరగనుంది. క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయనడానికి ఇదే ఉదాహరణ. అమెరికా కూడా జరుగుతున్న మార్పును స్వీకరించి వరల్డ్ కప్ ఈవెంట్‌తో క్రికెట్‌ను స్వాగతిస్తోంది. ఇదొక శుభారంభమని ఆశిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రభావం కనబరిచి సుదీర్ఘ కాలం గుర్తుండిపోయేలా ఉంటుంది. క్రికెట్ ఆడటమైనా, చూడటమైనా ఎలా ఫీల్ అవుతామో చాలా మందికి తెలుసు. ఇప్పటికే యూఎస్‌కు ఒక జట్టు కూడా రెడీ అయింది. ఇదంతా శుభ పరిణామమే" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ అదుర్స్..!
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అతడు ఈ ఐసీసీ టోర్నీలో 25 ఇన్నింగ్స్‌లలో 81.50 సగటుతో 1,141 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే 131.30 స్ట్రైక్‌రేట్‌ను కలిగి ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89 (నాటౌట్). టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక రన్స్ (1,141) కోహ్లీయే కావడం విశేషం.
2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఆరు మ్యాచులలో 98.67 సగటు, 136.41 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 296 పరుగులు బాదాడు. దీంతో ఈ ఎడిషన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.