North Korea: ఏకంగా 18 క్షిపణులతో కిమ్ యుద్ధ విన్యాసాలు.. సౌత్ కొరియాకు వార్నింగ్

North Korea Launches Military Drills

  • అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం తమకుందని చాటి చెప్పే ప్రయత్నం
  • ఫొటోలు, వీడియోలను అంతర్జాతీయ మీడియాకు విడుదల చేసిన నార్త్ కొరియా
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాలోకి ఉత్తర కొరియా బెలూన్లతో చెత్తను పంపించింది. అంతకుముందు తమ భూభాగంలోకి చెత్తను పడేయడానికి ప్రతీకారంగానే ఈ బెలూన్లు పంపించినట్లు తెలిపింది. తాజాగా ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ యుద్ధ విన్యాసాలు చేపట్టారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణులు తమ దగ్గర ఉన్నాయని చాటిచెప్పేందుకు ఏకంగా 18 మిసైళ్లతో పరీక్షలు నిర్వహించింది. దీంతో అవసరమైతే ఈ క్షిపణులను ప్రయోగించడానికి ఏమాత్రం వెనుకాడబోమని కిమ్ పరోక్షంగా దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విన్యాసాలకు అంతర్జాతీయ మీడియాను అనుమతించని కిమ్.. క్షిపణి ప్రయోగాల ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు.

రాజధాని ప్యాంగ్ యాంగ్  సమీపంలో సుప్రీం లీడర్ కిమ్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. వరుసగా ఏర్పాటు చేసిన క్షిపణులు ఏకకాలంలో నిప్పులు ఎగజిమ్ముతూ లక్ష్యం వైపుకు దూసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలలో కనిపించాయి. మొత్తం 18 క్షిపణులు టార్గెట్ ను రీచ్ అయ్యాయని కిమ్ ప్రకటించారు. కాగా, కొన్ని రోజులుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చెత్తతో యుద్ధం జరుగుతోంది. తమ దేశంలోని చెత్తను మూటకట్టి ఎయిర్ బెలూన్లతో ఒకరిపై మరొకరు పడేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర కొరియా చెత్త, మలంతో కూడిన బెలూన్లను దక్షిణ కొరియాలో జారవిడిచింది. సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, చెత్తను వదలడానికి ప్రతీకారంగా వీటిని పంపించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది.


North Korea
Kim Jong Un
Missile Test
Nuclear wepons
South Korea
Air Baloons

More Telugu News