OpenAI: భారత్ లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్‌ సంస్థ రహస్య ఆపరేషన్లు: ఓపెన్ ఏఐ సంచలన నివేదిక

OpenAI said that Israeli firm tried to disrupt Lok Sabha polls and AI used for manipulate public opinion

  • ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ ప్రయత్నాన్ని అడ్డుకున్నామని ప్రకటన
  • బీజేపీ వ్యతిరేక ఎజెండా.. విపక్షాలకు మేలు చేసేలా కామెంట్లు రూపొందించారని వెల్లడి
  • ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్నికల ప్రచార నిర్వహణ సంస్థపై ‘స్టోయిక్’పై ఓపెన్ ఏఐ ఆరోపణ

లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాలు వెల్లడి కావడానికి నాలుగు రోజుల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రకటన చేసింది. కృత్రిమ మేధ నమూనాలను (ఏఐ మోడల్స్) ఉపయోగించి భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని, అందుకు సంబంధించిన రహస్య కార్యకలాపాలను తాము నిలువరించినట్టు ఓపెన్ ఏఐ పేర్కొంది.

ఇజ్రాయెల్‌కు చెందిన ఓ అద్దె సంస్థ.. భారత్ ఎన్నికలపై దృష్టి సారించే కామెంట్లను రూపొందించిందని ఓపెన్‌ ఏఐ ‘థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్’ పేర్కొంది. అధికార బీజేపీపై విమర్శలు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రశంసించే కామెంట్లను రూపొందించారని తెలిపింది. భారతీయ ఎన్నికలపై దృష్టి సారించిన ఈ రహస్య కార్యకలాపాలను మే నెలలో మొదలుపెట్టారని, ఇజ్రాయెల్‌లోని రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ స్టోయిక్ (STOIC) ఈ నెట్‌వర్క్‌ను  నిర్వహించిందని ఓపెన్ ఏఐ రిపోర్ట్ పేర్కొంది. జనాల అభిప్రాయం, ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసే విధంగా ఈ రహస్య ఆపరేషన్లు చేస్తుంటారని నివేదిక పేర్కొంది.

తాము సాధించాలనుకున్న దానికి అనుగుణంగా ప్రజల అభిప్రాయాలను మార్చేందుకు ప్రయత్నించారని ఓపెన్ ఏఐ రిపోర్ట్ పేర్కొంది. రహస్య కార్యకలాపాల కోసం కంటెంట్‌ను రూపొందించడానికి, సవరించేందుకు ఇజ్రాయెల్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఖాతాలను ఉపయోగించారని తెలిపింది. ఈ కంటెంట్‌ను ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్, వెబ్‌సైట్‌లు, యూట్యూబ్‌‌లపై షేర్ చేశారని ఓపెన్ ఏఐ రిపోర్ట్ పేర్కొంది. మే నెలలో ఈ రహస్య కార్యకలాపాలను ప్రారంభించారని, ఇంగ్లిష్ కంటెంట్‌తో భారత ప్రజలను లక్ష్యంగా ఈ కార్యకలాపాలను ప్రారంభించారని నివేదిక పేర్కొంది.

ప్రజాస్వామ్యానికి ప్రమాదకర ముప్పు: కేంద్రమంత్రి
ఓపెన్ ఏఐ రిపోర్ట్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఎన్నికల ప్రభావిత ఆపరేషన్లకు బీజేపీ లక్ష్యంగా ఉందనే విషయం స్పష్టమైందన్నారు. తప్పుడు సమాచారం, భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈ పరిణామం ప్రమాదకరమైన ముప్పు అని ఆయన అభివర్ణించారు. కొన్ని రాజకీయ పార్టీలు లేదా వాటి తరపున ఇలాంటి కార్యకలాపాలకు తెగబడ్డారని ఆరోపించారు. రహస్య కార్యకలాపాలకు సంబంధించిన ఈ ప్లాట్‌ఫామ్స్‌ను చాలా ముందుగానే విడుదల చేసి ఉండవచ్చునని రాజీవ్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసే సమయానికి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయని అన్నారు.

  • Loading...

More Telugu News