Heatwave: నిప్పుల కుంపటిపై ఉత్తరాది రాష్ట్రాలు... నాగపూర్ లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత
- అనేక రాష్ట్రాల్లో ప్రచండ వేడిమి
- పలు రాష్ట్రాల్లో 50 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
- ఎండలు, వడగాడ్పులతో ప్రజల ఇక్కట్లు
- నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడుతుందన్న నిపుణులు
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఉత్తర భారతదేశం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటాయి. మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యధికంగా 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రస్థాయిలో వీస్తున్న వడగాడ్పులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో వడదెబ్బతో 54 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క బీహార్ లోనే 14 మంది మరణించారు. వారిలో 10 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు.
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్... రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ లోని కొన్ని భాగాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్ గఢ్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్ లోనూ సూర్య ప్రతాపం కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని, వాతావరణం చల్లబడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.