Hyderabad: ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్స్, బుక్స్, షూస్, బెల్టులు అమ్మవద్దు: హైదరాబాద్ డీఈవో కీలక ఆదేశాలు
- హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లకు ఆదేశాలు వర్తింపు
- ప్రైవేటు పాఠశాలల నిరంతర పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశం
- కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్లో విక్రయాలు ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలన్న డీఈవో
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్ డీఈవో గురువారం నగరంలోని ప్రైవేటు స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనిఫామ్లు, షూస్, బెల్టుల అమ్మకాలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. స్కూల్ ప్రాంగణంలో బుక్స్, స్టేషనరీ కూడా అమ్మకూడదని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రైవేటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్ళకు ఆదేశాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల నిరంతర పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులను ఆదేశించారు.
కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్లో విక్రయాలు ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు. అందుకే స్కూళ్లలో ఎలాంటి విక్రయాలు ఉండరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉల్లంఘనలు జరిపితే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.