Kerala: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి.. సరాసరి ఆసుపత్రికి తీసుకెళ్లిన డ్రైవర్.. బస్సులోనే డెలివరీ చేసిన వైద్యులు!

Kerala Woman Goes Into Labour In Bus Doctors Rush Inside For Delivery

  • కేరళలోని త్రిసూర్ లో చోటుచేసుకున్న అనూహ్య ఘటన.. వీడియో వైరల్
  • బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్
  • రూటు మార్చి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి నేరుగా తరలింపు
  • ఆమెను బస్సులోంచి తరలించే వీల్లేక అక్కడే పురుడు పోసిన వైద్యులు.. తల్లీబిడ్డ క్షేమం

కేరళలో మానవత్వం పరిమళించే ఘటన చోటుచేసుకుంది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఉదంతం జరిగింది. కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తోపాటు ఓ ఆసుపత్రి డాక్టర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్భిణికి పునర్జన్మ ప్రసాదించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డలను కాపాడారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే..
కేరళలోని మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల మహిళ కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. అయితే బస్సు పేరమంగళం అనే ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు. సమీపంలో ఉన్న అమలా ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు.

వైద్యుల సత్వర స్పందన..
అప్పటికే అక్కడ స్ట్రెచర్ తో సిద్ధంగా వున్న సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు, నర్సులు హుటాహుటిన బస్సులోకే చేరుకున్నారు. ప్రసవం చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలను కూడా బస్సు వద్దకే సిబ్బంది తీసుకొచ్చారు. చివరకు బస్సులోనే ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రిలోకి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్, ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు. అసాధారణ పరిస్థితుల్లోనూ గర్భిణిని కాపాడేందుకు వారు చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు.

More Telugu News