Postal Ballots: పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన అశోక్ బాబు
- ఏపీలో వివాదాస్పదంగా పోస్టల్ బ్యాలెట్లు
- పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సంతకం, స్టాంపు ఉండాలన్న నిబంధన లేదన్న అశోక్ బాబు
- ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని వ్యాఖ్య
- వైసీపీ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని విమర్శలు
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల విషయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సంతకం, సీల్ (స్టాంపు) ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు.
ఈసీ సడలింపులతో అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమని కొట్టిపారేశారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని అశోక్ బాబు వివరించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా గెజిటెడ్ అధికారులను ఈసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిందని, ఈసీ నియమించిన అధికారులే పోస్టల్ బ్యాలెట్ నిర్ధారిస్తూ సంతకం పెట్టారని అశోక్ బాబు వివరించారు. సదరు అధికారి సంతకం చాలు అని ఈసీ స్పష్టత ఇచ్చిందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉందని చెప్పారు.