SP Malika Garg: పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా? అని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు: ఎస్పీ మలికా గార్గ్

SP Malika Garg attends a meeting in Vinukonda
  • ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితురాలైన మలికా గార్గ్
  • నేడు వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభకు హాజరు
  • చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని వెల్లడి
  • పది రోజుల్లోనే 1,200 మందిని అరెస్ట్ చేశామన్న మలికా గార్గ్
  • ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇంట్లో కూర్చునే వినాలని స్పష్టీకరణ 
ఇటీవలే పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మలికా గార్గ్ నేడు వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. 

చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా? అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా మార్మోగుతోందని తెలిపారు.

కర్రలు, రాడ్లు చేతులతో పట్టుకుని తిరగడం, దాడులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, దాదాపు 1,200 మందిని అరెస్ట్ చేశామని మలికా గార్గ్ వెల్లడించారు. నరసరావుపేట జైలులో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు పంపుతున్నామని వివరించారు. 

ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చుని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తేలేదని ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.
SP Malika Garg
Vinukonda
Police
Palnadu District

More Telugu News