S Jaishankar: ఆ ముగ్గురూ బెస్టే.. కానీ కోహ్లీ ఫిట్‌నెస్‌, యాటిట్యూడ్ న‌చ్చుతాయి: కేంద్రమంత్రి జైశంకర్

Foreign Minister S Jaishankar says he admires Virat Kohli

  • తాజా ఇంటర్వ్యూలో క్రికెట్ పై మంత్రి జై శంకర్ కు ఎదురైన ప్రశ్న 
  • గ‌వాస్క‌ర్‌, టెండూల్క‌ర్‌, కోహ్లీల‌లో ఎవ‌రంటే ఇష్ట‌మ‌ని మంత్రిని అడిగిన యాంక‌ర్‌
  • అందుకే కోహ్లీని పిక్ చేసుకున్నానని వెల్లడి 

క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కి తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భార‌త‌ క్రికెట్ లెజెండ్స్ సునీల్ గ‌వాస్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీల‌లో ఎవ‌రంటే ఇష్ట‌మ‌ని యాంక‌ర్ ఆయ‌న‌ను అడిగారు. ఈ ప్రశ్నకు సచిన్, గవాస్కర్‌ల‌ను కాదని కోహ్లీ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని మంత్రి బ‌దులిచ్చారు. అంతేగాక తాను ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీనే ఇష్టపడటానికి కారణం కూడా చెప్పారు. 

  "ముగ్గురూ బెస్టే. కానీ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌, అతడి యాటిట్యూడ్ నాకు బాగా న‌చ్చుతాయి. అందుకే నేను అత‌డిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటా. ఈ కార‌ణంతోనే కోహ్లీని పిక్ చేసుకున్నాను. ఇవి కాకుండా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌ల‌ను పక్కన పెట్టడానికి వేరే కార‌ణాలు లేవు" అని చెప్పుకొచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూ తాలూకు వీడియోను కోహ్లీ అభిమానులు ఇప్పుడు తెగ వైర‌ల్ చేస్తున్నారు. 

ఇక 35 ఏళ్ల వయసులోనూ విరాట్ కోహ్లీ పాతికేళ్ల కుర్రాడిలా ఎంతో ఫిట్‌గా ఉంటాడ‌నే విష‌యం తెలిసిందే. ఆటపట్ల అతడి అంకిత భావం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌డి ఫిట్ నెస్, ప్రవర్తన నేటి తరం యువ‌త‌కు ఆదర్శం. మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తాడో.. అంతే సరదాగా కూడా ఉంటాడు. ఇక తనను కవ్విస్తే మాత్రం అంతకంటే ఎక్కువ రేంజ్‌లో కౌంటర్ ఇస్తాడు. అందుకే కోహ్లీని చాలా మంది ఇంతలా అభిమానిస్తూ ఉంటారు. ఈ జాబితాలోకి స్వయనా కేంద్ర విదేశాంగ మంత్రి కూడా చేరారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ముగిసిన ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరదపారించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచులు ఆడి, 150కి పైగా స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 741 పరుగులు చేశాడు. దీంతో టోర్నీలో టాప్ స్కోర‌ర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే ఫామ్‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా కొనసాగిస్తే భార‌త జ‌ట్టు ట్రోఫీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News