Empire State Buidling: ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై పిడుగులు!

Empire State Shares Pic Of Lightning Strike On Building

  • ఆ భవనాల పైన అమర్చిన పొడవాటి యాంటెనాలను తాకిన వైనం
  • అయినా అందులోని వారు సురక్షితం
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో, వీడియో

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న మాన్ హట్టన్ ప్రాంత ప్రజలను బుధవారం రాత్రి పిడుగులు హడలెత్తించాయి. అలాగే ఆ నగరంలోని రెండు ప్రఖ్యాత ఆకాశహర్మ్యాలపై పిడుగులు పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిటారున ఉన్న పొడవాటి యాంటెనాను భారీ పిడుగు తాకిన ఫొటోను ఆ భవనం తరఫున ఉన్న అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో దాని ప్రతినిధులు పోస్ట్ చేశారు. ఫొటో పక్కన అయ్యో అంటూ ఓ క్యాప్షన్ ను జత చేశారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెబ్ సైట్ ప్రకారం ఆ భవనంపై ఉన్న యాంటెనాను ఏటా సగటున 25 సార్లు పిడుగులు తాకుతుంటాయి.

మరోవైపు మరో ప్రఖ్యాత కట్టడమైన వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైనా పిడుగు పడింది. భవనం పైభాగాన ఏర్పాటు చేసిన యాంటెనాను పిడుగు తాకిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘అదిరింది’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా మరొకరేమో ‘అందులో ఉన్న మీరంతా క్షేమమేనా’ అంటూ పోస్ట్ పెట్టారు. విద్యుత్ సరఫరాలో ఆ భవనం స్వీయ సమృద్ధి సాధించినట్లుందని మరో యూజర్ సరదాగా వ్యాఖ్యానించాడు.

భారీ భవనాలపై యాంటెనాలు, ఇనుప రాడ్లను పిడుగులను ఆకర్షించేందుకే ఏర్పాటు చేస్తారు. భవనంలో నివసించే వారు విద్యుదాఘాతానికి గురై మరణించకుండా ఉండేందుకు, భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసేందుకు వాటిని అమరుస్తారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఆ ఇనుప రాడ్లు  ఏమీ పిడుగులను ఆకర్షించవు. అవి కేవలం భవనాలను పిడుగుపాట్ల నుంచి కాపాడతాయి. ఎత్తయిన భవనాలనే పిడుగులు ముందుగా తాకుతాయి.

Empire State Buidling
One World Trade Center
USA
Lightning
Strikes

More Telugu News