T20 World Cup 2024: ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఊరిస్తున్న రికార్డులివే!

Records and milestones will be once again under focus in T20 World Cup 2024

  • ఆసీస్‌కు చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకునే అవకాశం
  • ఒకేసారి మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించే ఛాన్స్
  • కీలక రికార్డులపై కన్నేసిన స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ 

టీ20 వరల్డ్ కప్-2024కు సమయం ఆసన్నమైంది. మరొక్క రోజులోనే ఈ మెగా టోర్నీ షురూ కాబోతోంది. జూన్ 1న నుంచి ఆరంభం కాబోతున్న టోర్నీలో ఈసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో పలు రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రత్యేక మైలురాయిని సాధించే ఛాన్స్ ఉంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీని గెలిస్తే మూడు ఐసీసీ టైటిల్స్.. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలను ఒకేసారి గెలిచిన జట్టుగా ఆసీస్ అవతరించనుంది. ఇప్పటికే 2023లో వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్ కప్‌లో మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. ఈసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిస్తే ఐసీసీ ఈవెంట్‌లలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆసీస్ చరిత్రలో నిలిచిపోనుంది.

కోహ్లీని ఊరిస్తున్న రికార్డు..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఎడిషన్ టీ20 వరల్డ్ కప్‌లో పలు రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా, అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన మహేల జయవర్ధనే రికార్డుపై కూడా కోహ్లీ కన్నేశాడు. జయవర్దనే 31 మ్యాచుల్లో అత్యధికంగా 111 ఫోర్లు నమోదు చేయగా.. విరాట్ 25 మ్యాచ్‌ల్లోనే 103 ఫోర్లు బాదాడు.

రికార్డులపై కన్నేసిన వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పలు కీలక రికార్డులపై కన్నేశాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు మొత్తం 34 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడి 806 పరుగులు చేశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ టోర్నీలో 1,000 పరుగుల మైలురాయిని కూడా చేరుకునే అవకాశం ఉంది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డుపై వార్నర్ కన్నేశాడు. డివిలియర్స్ 25 మ్యాచ్‌ల్లో 23 క్యాచ్‌లు అందుకొని తొలి స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు 21 క్యాచ్‌లతో వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్, రోహిత్ శర్మ 16 క్యాచ్‌లు, కేన్ విలియమ్సన్ 15 క్యాచ్‌లతో వరుస స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News