Kalki 2898 AD: రండి.. మా ‘బుజ్జి’ని నడపండి.. ఎలాన్ మస్క్ కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆహ్వానం

Nag Ashwin Invites Elon Musk To Drive Prabhas Bujji From Kalki

  • ‘ఎక్స్’ వేదికగా టెస్లా సీఈఓకు ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడి విజ్ఞప్తి
  • మేడిన్ ఇండియా స్ఫూర్తితో పూర్తిస్థాయి విద్యుత్ వాహనంగా తయారైనట్లు వెల్లడి
  • ఆరు టన్నుల బరువుగల ‘బుజ్జి’.. టెస్లా సైబర్ ట్రక్ తో పోటీపడగలదని ధీమా

  ప్రభాస్ నటించిన తాజా సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమాలోని భారీ అంతరిక్ష రోబో వాహనం ‘బుజ్జి’ని ఆడియన్స్ కు పరిచయం చేసిన దర్శకుడు.. తాజాగా దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ప్రపంచ కుబేరుడు, విద్యుత్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా యజమాని, సీఈఓ ఎలాన్  మస్క్ ను ‘బుజ్జి’ని చూసేందుకు రావాలని కోరాడు. దాన్ని స్వయంగా నడిపి చూడాలని ఆహ్వానించాడు. ఈ మేరకు మస్క్ కే చెందిన సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ వేదికగా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు.

‘డియర్ ఎలాన్ మస్క్ సార్.. మా ‘బుజ్జి’ని చూసి స్వయంగా నడపాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ‘బుజ్జి’ ఒక ఆరు టన్నుల రాకాసి. పూర్తిగా మేడిన్ ఇండియా స్ఫూర్తితో పూర్తిస్థాయి విద్యుత్ వాహనంగా ఇది తయారైంది. ఈ వాహనం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మీ (టెస్లా) సైబర్ ట్రక్ తో మా ‘బుజ్జి’ ఓ గొప్ప ఫొటో సెషన్ కాగలదని గట్టిగా నమ్ముతున్నా. ఆ రెండు వాహనాలు కలిసి పరుగులు తీసే దృశ్యం కనువిందు చేస్తుంది’ అంటూ నాగ్ అశ్విన్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. తన పోస్ట్ కు ఈ సినిమాలో హీరో ప్రభాస్ యాక్షన్ లుక్ ఫొటోను జత చేశాడు.

బుజ్జి ఆవిష్కరణ కార్యాక్రమం ఇటీవల హైదరాబాద్ లో అట్టహాసంగా జరగడం తెలిసిందే. హీరో ప్రభాస్ స్వయంగా ఆ భారీ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ఈ సినిమాలో ‘బుజ్జి’కి ప్రముఖ నటి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని తదితరులు నటించారు.

మరోవైపు మహీంద్రా వాహనాల గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సైతం ఇటీవల ‘బుజ్జి’ వినూత్న డిజైన్ ను మెచ్చుకున్నారు. మూడు చక్రాలతో పరుగులు తీసే ఈ భారీ వాహనం తయారవడం వెనక చెన్నైలోని తమ సంస్థ పరిశోధన కేంద్రానికి చెందిన ఇంజనీర్ల కృషి కూడా ఉందని చెబుతూ నెటిజన్లతో ఓ పోస్ట్ ను పంచుకున్నారు.

More Telugu News