Madhya Pradesh: 8 మంది కుటుంబ సభ్యులను నరికి చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
![Man axes eight family members to death dies by suicide in Madhya Pradesh](https://imgd.ap7am.com/thumbnail/cr-20240529tn6656c75f7f2e9.jpg)
- మధ్యప్రదేశ్ ఛింద్‌వాడాలో ఘటన
- ఎనిమిది రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న నిందితుడు దినేశ్
- ఇంతలోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వైనం
మధ్యప్రదేశ్ ఛింద్‌వాడాలో ఓ యువకుడు (27) తన కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తికి ఎనిమిది రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. తన భార్యతో పాటు సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని అతడు అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఎనిమిది మంది బాధితులు వరండాలో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
అనంతరం ఇంట్లోంచి బయటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తామియా జనపద్ పంచాయతీ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామం మహుల్జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
నిందితుడి చిన్నాన్న తల్వీ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. "దినేశ్ మా అన్న కొడుకు. అతను ఒక సంవత్సరం క్రితం మానసిక సమతుల్యతను కోల్పోయాడు. అయితే, చికిత్స తర్వాత అతను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. మేము అతనికి ఈ ఏడాది మే 21న వివాహం చేశాం. పెళ్లయిన కొన్ని రోజులకే అతనికి మళ్లీ మానసిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అతను తన భార్య వర్షా బాయి, అతని అన్న శర్వాన్, శర్వాన్ భార్య బారాతో బాయి, అతని తల్లి సియా బాయి , శర్వాన్ ముగ్గురు పిల్లలను చంపాడు. వారందరూ ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అదే సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి మా అక్కగారి కోడలు బయటకు వచ్చింది. చేతిలో గొడ్డలితో దినేశ్ ని చూసిన ఆమె అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే, అంతలోనే ఆమె కొడుకుని కూడా ఇతను గాయపరచాడు. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో దినేశ్ అక్కడి నుంచి పారిపోయి వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు" అని చెప్పాడు.