KTR: నిన్న ధాన్యం అమ్ముకోవడానికి గోస.. నేడు విత్తనాల కోసం రైతుల వెతలు: కేటీఆర్ విమర్శలు ​

KTR Fires on Congress Governament

  • ఎన్నికల ప్రచారమే తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అన్న కేటీఆర్  
  • పది గంటలు పడిగాపులు కాసినా విత్తనాలు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారని విమర్శ 
  • రాష్ట్రంలో పాలన పడకేసింది అనడానకి ఇదే నిదర్శనం అంటూ మండిపాటు 

‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారు.. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 వరకు క్యూలో నిలబడ్డా విత్తనాలు దొరకక వెతలు పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి దృష్టి మొత్తం ఎన్నికల ప్రచారంపైనే ఉందని, రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి ముందుచూపు కొరవడిందని, రాష్ట్రంలో పాలన పడకేసిందని అన్నారు. విత్తనాల పంపిణీని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి జాడలేదని, ఎన్నికల ప్రచారంలో తిరగడమే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో సీఎంకు తెలియదని కేటీఆర్ మండిపడ్డారు. సాగునీరు అందించడం చేతకాక పంటలు ఎండగొట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు లేదని విమర్శించారు.

కాంగ్రెస్ వచ్చింది కాటగలిసినం..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము కాటగలిసినమని రైతులు వాపోతున్నారని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ఆగం చేసిందని విమర్శించారు. తమ హయాంలో ఏనాడూ ఏ రైతూ విత్తనాల కోసం ఇంత అవస్థ పడలేదని గుర్తుచేశారు. రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటీ కష్టాలు, ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు? దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకే తిండీతిప్పలు లేకుండా చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకుండా వెంటనే విత్తనాల స్టాక్ తెప్పించి, బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.

KTR
Seeds
Farmers
Twitter

More Telugu News