Rinku Singh: ఆ కార‌ణంతోనే నేను వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక కాలేదు: రింకూ సింగ్‌

Rinku Singh Breaks Silence On T20 World Cup Snub

  • జట్టు కూర్పు కార‌ణంగానే తాను సెలెక్ట్ కాలేద‌న్న యువ బ్యాట‌ర్‌
  • 'దైనిక్ జాగరణ్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్ల‌డించిన రింకూ
  • ప్ర‌స్తుతం రిజ‌ర్వ్ ప్లేయ‌ర్‌గా రింకూ సింగ్‌

భార‌త యువ సంచ‌ల‌నం రింకూ సింగ్‌ను బీసీసీఐ 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయక‌పోవడంపై పెద్ద దుమార‌మే రేగింది. మాజీ క్రికెట‌ర్లు, అభిమానులు అత‌డిని ఇలా ప్ర‌పంచ‌కప్ నుంచి ప‌క్క‌కు పెట్ట‌డం ప‌ట్ల సెలెక్ట‌ర్లపై దుమ్మెత్తిపోశారు. ఓ మ్యాచ్ విన్న‌ర్‌ను త‌ప్పించ‌డం ఏంట‌ని బోర్డు పెద్ద‌ల‌ను దుయ్య‌బ‌ట్టారు. అయితే, బీసీసీఐ మాత్రం ఆల్‌రౌండ‌ర్ల కోసం ఇలా రింకూను ప‌క్క‌కు పెట్టిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే అక్ష‌ర్ ప‌టేల్‌, శివ‌మ్ దూబే వంటి ఆల్‌రౌండ‌ర్ల‌ను 15 మంది స‌భ్యుల జ‌ట్టులో చోటు క‌ల్పించింది. అలాగే రింకూ సింగ్‌ను రిజ‌ర్వ్ ప్లేయ‌ర్‌గా ఎంపిక చేసింది. 

మ‌రోవైపు ఈసారి ఐపీఎల్ సీజ‌న్‌లో ఈ యువ బ్యాట‌ర్ అంతగా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. సీజ‌న్ మొత్తం ఆడి కేవ‌లం 168 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అయితే, రింకూకు ఈసారి బ్యాటింగ్ చేసే అవ‌కాశం అంత‌గా రాలేదు కూడా. ఈ కార‌ణంతోనే అత‌ని బ్యాట్ నుంచి ఎక్కువ‌గా ప‌రుగులు రాలేదు. ఏదైతేనేం కేకేఆర్ మాత్రం చివ‌రికి ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తాను టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక కాక‌పోవ‌డంపై రింకూ సింగ్ పెద‌వి విప్పాడు. జ‌ట్టు కూర్పు కోస‌మే త‌న‌కు చోటు ద‌క్క‌లేద‌న్నాడు. త‌న విష‌యంలో జ‌రిగిన‌ నిర్ణయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మతో తాను చేసిన సంభాషణను కూడా ఈ సంద‌ర్భంగా వెల్లడించాడు.

"అవును.. మంచి పర్ఫామెన్స్ ఉన్నా సెలెక్ట్ కాకపోతే ఎవరికైనా కాస్త బాధగానే అనిపిస్తుంది. అయితే ఈసారి టీమ్ కాంబినేషన్ వల్ల సెలెక్ట్ కాలేకపోయాను. మ‌న చేతిలో లేని విషయాల గురించి పెద్దగా ఆలోచించకపోవ‌డం మంచిది. ఏం జరిగినా మ‌న మంచికే అనుకోవాలి. ప్రారంభంలో కొంచెం బాధ‌గా అనిపించింది. రోహిత్‌ భయ్యా ప్ర‌త్యేకంగా ఏం చెప్పలేదు. క‌ష్ట‌ప‌డుతూ ఉండు అన్నాడు. రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌స్తుంది. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేద‌న్నాడు" అని రింకూ 'దైనిక్ జాగరణ్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇక ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సునాయాసంగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫ్రాంచైజీకి ఇది మూడో ఐపీఎల్ ట్రోఫీ.

"ఐపీఎల్ ట్రోఫీ గెల‌వ‌డం అనేది అత్యద్భుతమైన అనుభూతి. నా కల నిజమైంది. నేను ఏడేళ్లుగా ఇక్క‌డ ఉన్నా. ప్ర‌స్తుతం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ క్రెడిట్ మొత్తం గౌతం గంభీర్‌ సార్‌దే. నేను ఎట్టకేలకు ఐపీఎల్‌ ట్రోఫీని అందుకున్నాను. ఇది దేవుడి ప్రణాళిక" అని ఐపీఎల్‌ విజయం తర్వాత రింకు తెలిపాడు.

  • Loading...

More Telugu News