Krishna Rao: తెలంగాణలో కొత్త కంపెనీ బీరు... స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Minister Jupalli responded on som distilleries

  • సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై జూపల్లి వివరణ
  • తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ అనుమతించిందని వెల్లడి
  • నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చినట్లు చెప్పిన మంత్రి
  • బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి నిబంధనల మేరకు ఇచ్చారో... ఇప్పుడూ అలాగే ఇచ్చినట్లు వివరణ

సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలోకి ఈ కంపెనీకి చెందిన కొత్తరకం మద్యం వస్తోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ... నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు.

కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలో ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తన వద్దకు ఏ ఫైలూ రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పోరేషన్‌కు ఉందన్నారు. ఈ క్రమంలోనే సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

బేవరేజెస్ కార్పోరేషన్ రోజువారీ కార్యకలాపాలు తన దృష్టికి రాలేదన్నారు. కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ - సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బేవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని గుర్తించాలన్నారు. సోమ్ డిస్టిలరీస్ రెండు దశాబ్దాలుగా... 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా చేస్తోందని తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. బేవరేజెస్ కార్పోరేషన్ గతంలో ఎలాగైతే అనుమతులు ఇచ్చిందో... ఇప్పుడూ అవే నిబంధనల మేరకు ఇచ్చిందని తెలిపారు. మన దేశానికి చెందిన బేవరేజెస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరమన్నారు.

Krishna Rao
Telangana
Liquor
Congress
  • Loading...

More Telugu News