Indigo Airlines: విమానం టాయ్ లెట్ లో ‘30 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్’ చీటీ! నిలిచిన టేకాఫ్
- ఢిల్లీ–వారణాసి ఇండిగో విమానంలో ఘటన
- అత్యవసర డోర్లు తెరిచి 176 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపిన సిబ్బంది
- క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు.. అనుమానాస్పద వస్తువు ఏదీ కనిపించలేదన్న ఇండిగో
ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానం బాంబు హెచ్చరికతో మంగళవారం ఉదయం టేకాఫ్ కు చివరి నిమిషంలో నిలిచిపోయింది.
‘30 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్’ అంటూ రాసి ఉన్న చీటీ విమాన టాయ్ లెట్ లో పైలట్ కు కనిపించింది. దీంతో అతను వెంటనే ఈ విషయాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలియజేయగా వారు విమానం టేకాఫ్ కాకుండా నిలిపేశారు. రన్ వే నుంచి దాన్ని పక్కకు తరలించారు.
విమానంలోని 176 మంది ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ల ద్వారా సిబ్బంది కిందకు దింపారు. అనంతరం భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 15న ఢిల్లీ నుంచి వడోదరా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టాయ్ లెట్ లోనూ ‘బాంబ్’ అంటూ రాసి ఉన్న చీటీ లభించింది. దీంతో అధికారులు తనిఖీలు చేయగా బాంబు లేనట్లు తేలింది. అలాగే ఢిల్లీలోని చాలా ఆసుపత్రులు, స్కూళ్లకు కూడా ఇటీవల బాంబు హెచ్చరికలు వచ్చాయి. ఆయా పరిసరాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అయితే తనిఖీల అనంతరం ఏమీ లభించకపోవడంతో వాటిని తప్పుడు హెచ్చరికలుగా పోలీసులు తేల్చారు.