NTR 101 Jayanthi: తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్: నారా చంద్రబాబు నాయుడు నివాళులు

Chandrababu Lokesh Jr NTR And Kalyan Ram Tributes Sr NTR

  • నేడు ఎన్టీఆర్ 101వ జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్
  • హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 

క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తుచేశారు. 

సంక్షేమం, అభివృద్ధితోపాటు పాలనా సంస్కరణలకు బాటలు వేశారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో  పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని పేర్కొన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని  పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ నాకు నిత్య స్ఫూర్తి: నారా లోకేశ్ 
ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని, తాతయ్య నందమూరి తారకరామారావుగారే తనకు నిత్య స్ఫూర్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన లోకేశ్.. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషిచేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.  

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని  హైదరాబాద్‌‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News