Teen Driver: అయినా వీరు మారలేదు! బాలుడు కారు నడుపుతుంటే బానెట్‌పై కూర్చున్న యువకుడు.. వీడియో ఇదిగో

Teen Drives Luxury Car In Mumbai Another Person On Bonnet Here Is Video

  • ముంబైలోని శివాజీ చౌక్ వద్ద ఘటన
  • వీడియో వైరల్ అయిన వెంటనే స్పందించిన పోలీసులు
  • బాలుడి తండ్రి అరెస్ట్.. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌పై కేసు

ఈ వీడియో చూశాక మీరు కూడా అంటారు.. అయినా వీరు మారడం లేదని! ఇటీవల పూణె బాలుడు లగ్జరీ కారును డ్రైవింగ్ చేస్తూ ఇద్దరి ప్రాణాలను బలిగొన్న తీరుపై దేశం మొత్తం విస్మయం వ్యక్తం చేసింది. సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాలుడు, కారు ఇచ్చినందుకు అతడి తండ్రిని, డ్రైవర్‌ను ఇరికించేందుకు ప్రయత్నించి దొరికిపోయిన బాలుడి తాతను పోలీసులు అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.

తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగలేదంతే. ఓ బాలుడు ఖరీదైన కారును నడుపుతుంటే మరో యువకుడు కారు బానెట్‌పై కూర్చొన్నాడు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. బాలుడు బీఎండబ్ల్యూ కారు నడుపుతుంటే శుభమ్ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్‌పై కూర్చొన్నాడు. 

ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు బాలుడికి కారు ఇచ్చినందుకు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. బానెట్‌పై కూర్చున్న యువకుడిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News