Graduate MLC Elections: తెలంగాణలో ముగిసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
- ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
- 4 గంటల వరకే క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం
- జూన్ 5న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
తెలంగాణాలోని ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ సమయం ముగియగా... అప్పటికే వరుసలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరిగింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది.
జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. మూడు జిల్లాల్లో 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహించారు. బరిలో 52 మంది ఉన్నారు. మూడువేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.