Jharkhand: బార్ లోకి రైఫిల్ తో దుండగుడు.. డీజేను కాల్చి చంపి పరారీ!

On Camera Man Shoots Dead Bengal DJ From Close Range Inside Ranchi Bar

  • ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఘటన
  • కాల్పులకు ముందు రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
  • ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయని పోలీసులు

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఘోరం జరిగింది. ఓ దుండగుడు ఏకంగా రైఫిల్ తో బార్ లోకి వచ్చి అక్కడ డీజేగా పనిచేస్తున్న యువకుడిని కాల్చి చంపడం కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం రాంచీలోని ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్స్ బార్ లో మద్యం మత్తులో ఉన్న మందుబాబులకు, బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. అమ్మాయిలను వేధించారనే విషయంపై రెండు గ్రూపుల వారు పరస్పరం కొట్టుకున్నారు. దీంతో ఓ గ్రూప్ లోని వ్యక్తులు ఈ సమాచారాన్ని తమ స్నేహితులకు అందించడంతో వారు కర్రలతో దాడి చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో బార్ లో రోజువారీ జీతానికి పనిచేస్తున్న సందీప్ అనే డిస్క్ జాకీ (డీజే)పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ముఖం కనిపించకుండా టీషర్ట్ చుట్టుకున్న దండగుడు అతిదగ్గర నుంచి సందీప్ ను కాల్చాడు. దీంతో ఆ యువకుడు కుప్పకూలి పడిపోయాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సందీప్ ను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

ఈ ఘటనపై రాంచీ ఎస్ ఎస్పీ చందన్ కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ అనంతరం మొత్తం ఆరు బుల్లెట్లు ఫైర్ అయ్యాయని చెప్పారు. తమ దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు బార్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. కానీ ఇప్పటివరకు నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన నిపుణులు ఘటనాస్థలికి చేరుకొని అక్కడి ఆధారాలను సేకరించారు.

కాల్పుల వీడియో నెట్ లో చక్కర్లు కొడుతుండటంతో దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘రాంచీలో అర్ధరాత్రి మద్యం అందించేందుకు సిబ్బంది నిరాకరించడంతో ఓ డీజేను దుండగుడు కాల్చి చంపాడు. అతని చేతిలో రైఫిల్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై ఎన్ ఐఏ దర్యాప్తు చేపట్టాలి’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. మరో యూజర్ స్పందిస్తూ సాధారణంగా బార్లను రాత్రి 11 గంటలకు మూసేయాల్సి వున్నప్పటికీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఎందుకు తెరిచి ఉందని ప్రశ్నించాడు. పోలీసుల ఉదాసీన వైఖరికి కాల్పుల ఘటన నిదర్శనమని పేర్కొన్నాడు. రాంచీలో చాలా బార్లు అర్ధరాత్రి 2–3 గంటల దాకా తెరిచే ఉంటాయని వివరించాడు.

  • Loading...

More Telugu News