Amit Shah: ఏపీలో కూటమి ఘన విజయం.. 17 లోక్‌సభ స్థానాలు మావే: అమిత్ షా

Amit Shah shows confidence about winning in Andhra Pradesh

  • ఈసారి 400కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నామన్న కేంద్రమంత్రి
  • విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ గణనీయమైన స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా
  • చత్తీస్‌గఢ్‌లో తప్ప మరెక్కడా నక్సల్స్ లేరన్న షా
  • వచ్చే ఐదేళ్లలో యూసీసీ అమలు చేస్తామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాల్లో గెలువబోతోందని జోస్యం చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు. 

యూసీసీని అమలు చేస్తాం
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలోనే కాకుండా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్టు పేర్కొన్నారు. ఒడిశాలో 16-17 స్థానాల్లో గెలువబోతున్నామని, ఏపీలో 17, పశ్చిమ బెంగాల్‌లో 24 నుంచి 32 స్థానాల వరకు ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని వివరించారు. తాము మూడోసారి అధికారం చేపట్టాక విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు.

ఇకపైనా అలాంటి ప్రచారమే చేస్తాం
అగ్నిపథ్ పథకంపై వస్తున్న విమర్శలపై స్పందించిన షా.. దీనికి మించిన ఆకర్షణీయ పథకం మరోటి లేదని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ తెస్తామని చెబుతున్న ఏకీకృత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై విమర్శలు గుప్పించారు. సంపన్నులు వాడే విలాస వస్తువులు, పేదలు వాడే సరకులపై ఒకే పన్ను తీసుకొస్తామనడాన్ని తప్పుబట్టారు. ఆర్టికల్-370 రద్దును చూపెడుతూ ఓట్లు అడగడం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మత ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే ఇకపైనా బీజేపీ అలాంటి ప్రచారమే చేస్తుందని తేల్చి చెప్పారు. 

రెండుమూడేళ్లలో నక్సలిజం అంతం
రాహుల్‌గాంధీ వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకే పోలింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని విమర్శించారు. వచ్చే రెండుమూడేళ్లలో నక్సలిజం అంతమైపోతుందన్న షా.. చత్తీస్‌గఢ్‌లో తప్ప మరెక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం మోదీ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చిందన్న షా.. ఇకపై వేసవిలో కాకుండా ఇంకో సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి పెట్టనున్నట్టు వివరించారు.

Amit Shah
Andhra Pradesh
NDA
BJP
PTI
  • Loading...

More Telugu News