Mallu Ravi: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ దారితప్పిన పోలీసు... కేసీఆర్, కేటీఆర్ ల వ్యూహాలను అమలు చేస్తున్నారు: మల్లు రవి

Mallu Ravi fires on BRS leader RS Praveen Kumar

  • కొల్లాపూర్ లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలకు బదులిచ్చిన మల్లు రవి

కొల్లాపూర్ లో శ్రీధర్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త హత్య నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

కొల్లాపూర్ లో శ్రీధర్ రెడ్డి హత్య వెనుక నిజానిజాలు తేల్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు. కొల్లాపూర్ లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తున్నారంటూ ప్రవీణ్ కుమార్ పిచ్చెక్కినవాడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ప్రవీణ్ కుమార్ గతంలో అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడే పరిటాల రవి హత్య జరిగిందని, కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల పిల్లలను కాల్చి చంపిన చరిత్ర ప్రవీణ్ కుమార్ ది అని మల్లు రవి నిప్పులు చెరిగారు. ఇదేమైనా కల్లోలభరిత ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు చేసినట్టు అనుకుంటున్నావా? వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 

ప్రవీణ్ కుమార్ గతంలో ఐపీఎస్ అధికారిగా పనిచేశారని, కానీ ఇప్పుడాయన దారితప్పిన పోలీసులా మాట్లాడుతున్నారని మల్లు రవి విమర్శించారు. నాడు కేసీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారని, ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ ల వ్యూహాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News