PV Sindhu: మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి
- చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో పరాజయం
- వరుస గేమ్‌లలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిన సింధు
- పారిస్ ఒలింపిక్స్‌కు సింధుకి తప్పని నిరాశ
రెండు సార్లు ఒలింపిక్స్ పతకాలు ముద్దాడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి మలేసియా మాస్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి గేమ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు గేమ్‌లలో చతికిలపడింది. ముఖ్యంగా రెండో సెట్‌లో 5-21 భారీ వ్యత్యాసంతో వెనుకబడింది. సింధు తప్పిదాలను వాంగ్ జీయీ చక్కగా ఉపయోగించుకుంది.
మొదటి గేమ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్‌లో ఆ దూకుడుని ప్రదర్శించలేకపోయింది. ఇక మూడో గేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించినా వాంగ్ జీయీ అద్భుత రీతిలో పుంజుకుంది. చక్కటి ప్లేస్‌మెంట్లు, షాట్లతో రెండు, మూడు గేమ్‌లను సొంతం చేసుకుంది. దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మలేసియా మాస్టర్స్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సింధుకి నిరాశే ఎదురైంది. కాగా టైటిల్ వేటలో సింధుకి మరోసారి నిరాశే ఎదురైంది. గతే రెండేళ్లుగా ఆమె ఎలాంటి టైటిల్స్ గెలవకపోవడం గమనార్హం.