Amalapuram: అమలాపురంలో పోలీసు బందోబస్తుతో వెళ్లి ఓటేసిన కుటుంబం!
- తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన
- స్థానికంగా ఓ కుటుంబానికి రహదారి గొడవ
- అదే దారిలో పోలింగ్ కేంద్రం
- ఓటు వేసేందుకు రక్షణ కావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి మొర
- పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పంపిన అధికారులు
- వారి సమక్షంలోనే ఓటు హక్కు వినియోగించుకున్న కుటుంబం
- వీడియో తీసి భద్రపరిచిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో ఓ కుటుంబం అత్యంత భద్రత నడుమ తమ ఓటు హక్కును వినియోగించుకుంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న ఏపీలో పోలింగ్ జరిగింది. అమలాపురంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారికి సంబంధించిన వివాదం ఉంది. ఓటు వేసేందుకు వెళ్లాలంటే ఆ రోడ్డు మీదుగా ఆ కుటుంబం వెళ్లాలి. కానీ అందుకు తమను అనుమతించరని భావించిన కుటుంబం ఓటు హక్కును ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని భావించింది.
ఈ నేపథ్యంలో ఆ కుటుంబం తమ సమస్యను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పరిశీలించిన ఈసీ ఈ సంగతి చూడాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. అక్కడి నుంచి ఆ ఫిర్యాదు ఎన్నికల పరిశీలకుడి దృష్టికి చేరింది. స్పందించిన ఆయన పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బందిని ఆ కుటుంబానికి భద్రతగా పంపించారు. దీంతో ఆ కుటుంబం వారి భద్రత మధ్య పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్టు పోలీసులు తెలిపారు.