KTR: ఇదివరకు కేఏ పాల్‌పై జోకులు వేసేవారు.. ఇక కోమటిరెడ్డిపై వేసే పరిస్థితి వస్తుంది!: కేటీఆర్
- మంత్రి హోదాలో ఉండి కరెంట్ పోతుందని ఎలా అంటారని మండిపాటు
- కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అని చురక
- మూర్ఖులు, సన్నాసులు ప్రభుత్వాన్ని నడిపిస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్య
ఇదివరకు కేఏ పాల్‌పై అందరూ జోకులు వేసేవారని... త్వరలో కోమటిరెడ్డిపై జోకులు వేసే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక మంత్రి హోదాలో ఉండి 'కరెంట్ పోతుంద'ని ఎలా మాట్లాడుతారని మండిపడ్డారు. ఆయన మంత్రా? లేక జోకరా? అని ఎద్దేవా చేశారు. మూర్ఖులే అలా మాట్లాడుతారన్నారు.
కరెంట్ పోతే 14వ అంతస్తు నుంచి 27వ అంతస్తుకు ఎలా పోతారు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారని... మరి 14 అంతస్తులే కడితే... 3వ అంతస్తులో ఉన్నప్పుడు కరెంట్ పోతే 14వ అంతస్తుకు ఎలా వెళతారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు మంత్రి నోటి నుంచి కరెంట్ పోతుందనే మాట ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. తాము ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రాలేదన్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత మూర్ఖులు, ఎంత సన్నాసులు, ఎంత జోకర్లు నడుపుతున్నారో తెలుస్తోందన్నారు. కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అని చురక అంటించారు. ఆయన మంత్రా... నాకు అర్థం కావడం లేదు... పైగా ఆయన వేసిన ప్రశ్నకు మీరు (జర్నలిస్టులు) నన్ను అడగడమేమిటన్నారు.