Etela Rajender: అధికారంలో ఉన్నప్పుడే ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇప్పుడు ఎలా ఇస్తుంది?: ఈటల

Etala Rajender Election Campaign At Kottagudem District

  • బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన బీజేపీ నేత
  • పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపు
  • కొత్తగూడెంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరఫున ఈటల ప్రచారం

తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగులను పట్టించుకోలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టని బీఆర్ఎస్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఉద్యోగాలు ఎలా ఇస్తుందంటూ ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన ఇల్లందులో మాట్లాడారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలంటూ గ్రాడ్యుయేట్లకు ఆయన పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఈటల ఆరోపణలు గుప్పించారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్ హయాంలో మండలాల వారీగా కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచినా సరే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షనే గెలిచిందని గుర్తుచేశారు. ఉద్యమ ఆకాంక్షలను మరోసారి గుర్తుతెచ్చుకుని, రాష్ట్రానికి అన్యాయం చేసిన చేస్తున్న పార్టీలకు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణపాఠం నేర్పించాలని అన్నారు. నోటుతో ఓటును కొనాలని చూసే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

గతంలో కాంగ్రెస్ పాలన మొత్తం అవినీతి, స్కాంలతో నిండిపోయిందని, కోల్, 2జీ వంటి స్కాంలు జరిగాయని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. మోదీ పదేళ్ల పాలనలో ఒక్క స్కాం కూడా లేదని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు గడిచినా హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.

డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ హామీల అమలును గాలికి వదిలేసిందని మండిపడ్డారు. సగటు భారతీయుడిని గర్వంగా జీవించేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఈటల పిలుపునిచ్చారు.

Etela Rajender
BJP
Graduate MLC Elections
Kottagudem
BRS
Congress
  • Loading...

More Telugu News