Acharya Nagarjuna University: ప్రొఫెసర్‌పై అసిస్టెంట్ ప్రొఫెసర్ దాడి.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఘటన!

Assistant professor attacks senior professor in Acharya nagarjuna university

  • అంబేద్కర్ అధ్యయన కేంద్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డాక్టర్ అబ్రహాం లింకన్‌కు జీతం అందని వైనం
  • ఢిల్లీ వెళ్లేందుకు డబ్బు ఇవ్వాలని సీనియర్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్‌ను  అడిగిన లింకన్
  • డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో అశోక్‌కుమార్‌పై బుధవారం దాడి
  • మరుసటి రోజు అశోక్‌కుమార్‌కు స్వల్ప గుండెపోటు, త్వరలో స్టెంట్స్ వేయనున్న వైద్యులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ అశోక్ కుమార్‌పై అంబేద్కర్ అధ్యయన కేంద్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డాక్టర్ అబ్రహాం లింకన్ దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై అశోక్ కుమార్ భార్య వైస్ ఛాన్సలర్ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఓ ప్రాజెక్టుపై అబ్రహాం లింకన్ అంబేద్కర్ అధ్యయన కేంద్రంలో ఐదేళ్లు పనిచేసేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చారు. అయితే, గత కొంతకాలంగా తనకు జీతం రావడం లేదని, ఢిల్లీకి వెళ్లి వచ్చేందుకు కొంత నగదు ఇవ్వాలని అశోక్‌ కుమార్‌ను అడగ్గా, తాను ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది.

 ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న లింకన్ బుధవారం మళ్లీ ఆయన్ని గట్టిగా అడగ్గా వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వెళ్లేందుకు తాను ఎందుకు ఇవ్వాలని సమాధానమివ్వడంతో దాడికి పాల్పడ్డాడు. ఛాతిపై బలంగా కొట్టడంతో అశోక్‌కుమార్ కిందపడిపోయారు. గురువారం ఆయనకు స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు స్టెంట్స్ వేయాలని సూచించారు. శనివారం స్టెంట్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News