Prakash Reddy: హైదరాబాద్ ను యూటీ చేస్తారన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత

BJP Prakash Reddy responds on Harish Rao UT comments

  • హైదరాబాద్‌ను యూటీగా చేస్తారనడం సరికాదన్న బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి
  • హరీశ్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి బోడిగుండుకు... మోకాలికి లింక్ పెడుతున్నారని వ్యాఖ్య

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి హరీశ్ రావుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను యూటీగా చేస్తారని మాట్లాడటం సరికాదన్నారు. హరీశ్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం... 20 ఏళ్ళకు పైగా ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి బోడిగుండుకు... మోకాలికి లింక్ పెడుతున్నారని విమర్శించారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు తలాతోక లేని వ్యాఖ్యలు చేశారన్నారు.

అంతకుముందు, హరీశ్ రావు మాట్లాడుతూ... హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయిందని... ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను మరికొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. అదే జరిగితే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కటై తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ వైపు ఉండాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు రాజకీయం కావాలని... కానీ కేసీఆర్‌కు తెలంగాణతో పేగుబంధం ఉందన్నారు. గతంలో పదేళ్లు కామన్ క్యాపిటల్ అంటే కేసీఆర్ వ్యతిరేకించారని.. ఇప్పుడు మరోసారి అలాంటి కుట్రలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాదని... తెలంగాణ క్యాపిటల్ అన్నారు.

  • Loading...

More Telugu News