Swati Maliwal: ఎంపీ సీటుకు రాజీనామా చేసే ప్రసక్తే లేదు: స్వాతి మలీవాల్
- తనను మర్యాదగా అడిగి ఉంటే ఎంపీ సీటు వదులుకునేదాన్నన్న స్వాతి మలివాల్
- తనకెప్పుడూ పదవులపై ఆశ లేదని స్పష్టీకరణ
- 2006లో తన జాబ్ వదులుకుని మరీ ఆప్‌తో ప్రయాణం ప్రారంభించినట్టు వెల్లడి
- ఇప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ తనతో రాజీనామా చేయించలేదని వ్యాఖ్య
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని కేసు పెట్టిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తాజాగా మరో కీలక వ్యాఖ్య చేశారు. తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ‘‘వాళ్లకు ఎంపీ సీటు కావాలంటే నన్ను అడిగి ఉండాల్సింది. కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చుండేదాన్ని. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. మీరు నా కెరీర్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది.. నేను ఏ రోజూ పదవుల కోసం ఆశపడలేదు’’ అని ఆమె అన్నారు.
‘‘2006లో ఇంజినీరింగ్ జాబ్ వదులుకుని వీళ్లతో చేతులు కలిపాను. అప్పుడు మేము ఎవరమో ఎవరికీ తెలీదు. అప్పట్లో ముగ్గురం మాత్రమే ఉండేవాళ్లం. అప్పటి నుంచీ నేను పనిచేస్తూనే ఉన్నా. క్షేత్రస్థాయిలో కూడా పని చేశా. ఇన్నేళ్లల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించా. కావాల్సి వస్తే నేను రాజీనామా చేసి ఉండేదాన్ని. ఏ పదవీ లేకపోయినా నేను పని చేయగలను. ఇప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు. నేను రాజీనామా చేయను’’ అని ఆమె చెప్పారు.
ఇక స్వాతి మలివాల్ కేసులో నిందితుడిగా ఉన్న బిభవ్ కుమార్‌కు కోర్టు ఇటీవలే ఐదు రోజుల కస్టడీ విధించింది. బిభవ్ ఫోనులోని డేటాను వెలికితీసేందుకు పోలీసులు అతడిని మంగళవారం ముంబైకి తరలించారు. బిభవ్ తన ఫోనులోని డేటాను మరో వ్యక్తికి ట్రాన్సఫర్ చేశాక, ఫోనును ఫార్మాట్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.