Swati Maliwal: నాపై దాడి జరిగినప్పుడు కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు... అరిచినా రక్షించేందుకు ముందుకు రాలేదు: స్వాతి మాలివాల్
- మే 13న ముఖ్యమంత్రి నివాసంలో దాడి జరిగిందన్న స్వాతి మాలివాల్
- ఉదయం తొమ్మిది గంటలకు సీఎం నివాసానికి వెళ్లినట్లు వెల్లడి
- కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు.. వస్తారని చెప్పి తనను గదిలో కూర్చోబెట్టారని వెల్లడి
- బిభవ్ కుమార్ వచ్చి తనపై దాడి చేశారని ఆరోపణ
- ఏడెనిమిదిసార్లు తన చెంపపై కొట్టాడని ఆవేదన
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ తనపై జరిగిన దాడి మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని... ఈ దాడి విషయంలో తాను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వదలుచుకోలేదన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ... మే 13న ముఖ్యమంత్రి నివాసంలో ఆయన పీఏ తనపై దాడి చేసిన సమయంలో తాను అరిచానని... కానీ రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆరోపించారు.
తాను తొమ్మిది గంటలకు సీఎం నివాసానికి వెళ్లానని... అయితే ఓ గదిలో తనను వేచి ఉండమని చెప్పారని తెలిపారు. కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని... ఆయన తనను కలిసేందుకు వస్తారని సిబ్బంది చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలో బిభవ్ కుమార్ ఒక్కసారిగా తాను ఉన్న గదిలోకి దూసుకు వచ్చాడని... తాను కేజ్రీవాల్ గురించి అడుగుతుంటే తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడెనిమిదిసార్లు తన చెంపపై కొట్టాడని... దీంతో అతనిని వెనక్కి నెట్టివేసే ప్రయత్నం చేశానన్నారు. కానీ తనను కాలితో లాగి టేబుల్‌కు తన తలను బాదారని వాపోయారు.
వేరేవాళ్ల సూచనల మేరకే బిభవ్ కుమార్ తనపై దాడి చేశారా? లేదా? అనేది విచారణలో తేలుతుందన్నారు. ఈ దాడి కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానన్నారు. తాను ఎంత అరిచినా ఇంట్లో ఉన్న కేజ్రీవాల్ పట్టించుకోలేదని మండిపడ్డారు. తనమీద జరిగిన దాడిపై గళమెత్తుతానని... తన కెరీర్ ఇబ్బందిలో పడినా వదిలిపెట్టేది లేదన్నారు. తనకు ద్రోహం చేశారన్నారు.