Yuzvendra Chahal: కోహ్లీ వికెట్ తీసి సంచలన రికార్డు నెలకొల్పిన చాహల్

Yuzvendra Chahal creates history with Virat Kohli big wicket in the IPL 2024 Eliminator Match

  • రాజస్థాన్‌ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన స్పిన్నర్
  • చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న యజువేంద్ర చాహల్
  • ఆర్సీబీ తరపున కూడా అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్

రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్‌ తీసిన చాహల్... ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ తరపున మొత్తం 45 మ్యాచ్‌లు ఆడిన చాహల్ తాజాగా కోహ్లీ ఔట్‌తో కలుపుకొని మొత్తం 66 వికెట్లు సాధించాడు. 75 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్లు తీసిన పేసర్ సిద్ధార్థ్ త్రివేదిని చాహల్ వెనక్కి నెట్టాడు.

రాజస్థాన్ తరపున ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
1. యజువేంద్ర చాహల్ - 66 వికెట్లు (45 మ్యాచ్‌ల్లో)
2. సిద్ధార్థ్ త్రివేది - 65 వికెట్లు (75 మ్యాచ్‌ల్లో)
3. షేన్ వాట్సన్ - 61 వికెట్లు (70 మ్యాచ్‌ల్లో)
4. షేన్ వార్న్ - 57 వికెట్లు (54 మ్యాచ్‌ల్లో)
5. జేమ్స్ ఫాల్క్‌నర్ - 47 వికెట్లు (42 మ్యాచ్‌ల్లో)

ఇక గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 112 మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఏకంగా 139 వికెట్లతో ఆ జట్టు తరపున కూడా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కాగా గత రాత్రి ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో చాహల్ రాణించాడు. బెంగళూరు జట్టుని 172 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు తీసింది ఒక్క వికెటే అయినప్పటికీ తన అనుభవంతో పరుగులను నియంత్రించాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని అద్భుతమైన బంతితో ఔట్ చేసి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించాడు.

  • Loading...

More Telugu News