SRH: సరాసరి ఫైనల్లోకి వెళతారనుకుంటే... చిత్తుగా ఓడిన సన్ రైజర్స్

SRH loses to KKR in IPL Qualifier 1

  • అహ్మదాబాద్ లో ఐపీఎల్ క్వాలిఫయర్-1
  • 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కోల్ కతా
  • అన్ని రంగాల్లో విఫలమైన సన్ రైజర్స్
  • ఈ నెల 24న క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్ జట్టు

కోల్ కతా నైట్ రైడర్స్ పై నెగ్గి సగర్వంగా ఐపీఎల్ ఫైనల్ చేరదామని ఆశించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిరాశ తప్పలేదు. ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-1లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైందంటే సబబుగా ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్నింటా సన్ రైజర్స్ ఆటగాళ్లు తేలిపోయారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జోడీ భారీ షాట్లతో విరుచుకుపడడంతో సన్ రైజర్స్ బెంబేలెత్తిపోయింది. వెంకటేశ్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 51 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 

అంతకుముందు, కోల్ కతా ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) తొలి వికెట్ కు 44 పరుగులు జోడించి ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. 

సన్ రైజర్స్ బౌలింగ్ ఈ మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావవంతంగా లేదు. ఫీల్డర్లు సరేసరి... కొన్ని క్యాచ్ లు వదిలి కోల్ కతాకు మేలు చేశారు. ఈ మ్యాచ్ లో విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ నేరుగా ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. 

ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్స్-2లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో సన్ రైజర్స్ ఈ నెల 24న చెన్నైలో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది.

  • Loading...

More Telugu News