Gatecrash: వరుడిపై వధువు మాజీ ప్రియుడి పిడిగుద్దులు!

Man Gatecrashes Ex Girlfriend Wedding Punches Groom on Stage
  • పెళ్లి వేదికపై నవ దంపతులతో ఫొటో దిగేందుకు వచ్చి దాడి చేసిన వైనం
  • రాజస్థాన్ లోని భిల్వారాలో సినిమా సన్నివేశాన్ని తలదన్నే ఘటన 
  • నెట్టింట వీడియో వైరల్.. రకరకాల కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
తన మాజీ ప్రేయసి తన కళ్లెదుటే వేరొకరని పెళ్లి చేసుకోవడాన్ని చూసి ఆమె లవర్ తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా మన తెలుగు‘అర్జున్ రెడ్డి’లా, హిందీ ‘కబీర్ సింగ్’లా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా పెళ్లి వేదికపైనే వరుడిని రఫ్ఫాడించాడు. అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

రాజస్థాన్ లోని భిల్వారాలో సినిమాను తలదన్నే రీతిలో ఈ దాడి జరిగింది. నవ దంపతులతో ఫొటో దిగేందుకు వేదికపైకి ఎక్కిన ఓ యువకుడు తన మాజీ ప్రేయసి పక్కన నిలబడి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం వరుడి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా వెంటనే అతన్ని పట్టుకొని వెనక్కి లాగేశారు. ఈ తతంగాన్నంతా కాస్త దూరం నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పెళ్లి కూతురు, ఆమె మాజీ లవర్ గతంలో ఒకే స్కూల్ లో పనిచేశారని అందులో పేర్కాన్నాడు.

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ అతన్ని పిరికివాడిగా అభివర్ణించాడు. ‘అమ్మాయి మనసు గెలుచుకోలేని వ్యక్తులు వారి ఆగ్రహాన్ని ఇలానే బయటపెడతారు.’ అంటూ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ ఈ సన్నివేశం క్రైం ప్యాట్రోల్ ఎపిసోడ్ ను తలపించిందని పేర్కొన్నాడు. మరొకరేమో ‘అంతా అయిపోయాక ఇప్పుడు ఇలా చేయడంలో అర్థం ఏముంది?’ అని ప్రశ్నించారు.


Gatecrash
Wedding
Rajasthan
Groom
Punched in face
Ex lover

More Telugu News