ICC Warant: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఐసీసీ అరెస్ట్ వారెంట్?
- గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐసీసీ విచారణ
- అరెస్ట్ వారెంట్ జారీ చేసే విషయంపై ఐసీసీ పరిశీలిస్తోందన్న చీఫ్ ప్రాసిక్యూటర్
- హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ పైనా నేరారోపణలు
హమాస్ అంతమే తమ లక్ష్యమని, వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవడంపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని, అమాయక పౌరుల మరణాలకు కారణమవుతున్నారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టినట్లు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
యుద్ధ నేరాలకు సంబంధించి నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అంశాన్ని ఐసీసీ జడ్జిల బృందం పరిశీలిస్తోందని, త్వరలో వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ చెప్పారు. నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్, హమాస్ లీడర్ యహ్యా సిన్వర్, మొహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనీయహ్ లకు వారెంట్ జారీ చేయనుందని తెలిపారు. అయితే, ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ జడ్జిలు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటారని పేర్కొన్నారు.
వారెంట్ జారీ చేస్తే ఏం జరగనుంది..
ఐసీసీలో ఇజ్రాయెల్ సభ్య దేశం కాదు కాబట్టి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వెంటనే నెతన్యాహుకు కానీ, గాలంట్ కు కానీ తక్షణం వచ్చిపడే ఇబ్బందేమీ లేదు. అయితే, విదేశాలకు ప్రయాణించడం మాత్రం ఇద్దరికీ కష్టతరం కానుంది. ఐసీసీ సభ్య దేశాల్లో అడుగుపెడితే అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి విదేశీ ప్రయాణం ఇబ్బందికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా, గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డామనే ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖండించారు. కరీం ఖాన్ ఆరోపణలు తనతో పాటు ఇజ్రాయెల్ ఆర్మీకి, ఇజ్రాయెల్ పౌరులపై దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా నెతన్యాహుకు మద్దతుగా నిలిచారు. ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.