Michael Vaughan: అది మా వాళ్ల‌ త‌ప్పుకాదు.. ఐపీఎల్ షెడ్యూలే స‌రిగా లేదు: మైఖేల్ వాన్‌

Michael Vaughan blames IPL scheduling

  • ఇంగ్లండ్ క్రికెట‌ర్లు కీల‌క ద‌శ‌లో ఐపీఎల్‌ను వ‌దిలి వెళ్ల‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు 
  • ఐపీఎల్ షెడ్యూల్‌ను త‌ప్పుబట్టిన మైఖేల్ వాన్‌ 
  • సొంత దేశానికి ప్రాధాన్యం ఇవ్వ‌డంలో త‌ప్పులేదన్న‌ ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్
  • ఐపీఎల్ షెడ్యూలే ఆల‌స్య‌మైందని వ్యాఖ్య‌

ఇంగ్లండ్ క్రికెట‌ర్లు కీల‌క ద‌శ‌లో ఐపీఎల్‌ను వ‌దిలి వెళ్ల‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇలా వారు ఐపీఎల్‌ను మ‌ధ్య‌లో వీడ‌టంపై భార‌త మాజీ క్రికెట‌ర్లు సునీల్ గ‌వాస్క‌ర్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్ మండిప‌డ్డారు. ఒక‌వేళ ఇంగ్లీష్ క్రికెట‌ర్లకు టోర్నీ మొత్తం ఆడ‌డం వీలు ప‌డ‌క‌పోతే రాకూడదని.. ఇలా కీల‌క ద‌శ‌లో మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోవ‌డం ఏంట‌ని ఇర్ఫాన్ ఫైర్ అయ్యారు.  

ఇదే విష‌య‌మై ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ మైఖేల్ వాన్ స్పందించాడు. ఇందులో త‌మ క్రికెట‌ర్ల‌ది త‌ప్పేమీ లేద‌న్నాడు. ఐపీఎల్ షెడ్యూల్ స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు వెళ్లిపోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. "సొంత దేశానికి ప్రాధాన్యం ఇవ్వ‌డంలో త‌ప్పులేదు. ఐపీఎల్ షెడ్యూల్ ఆల‌స్య‌మైంది. మే 19న ఫైన‌ల్ జ‌రిగేలా ఉంటే.. ఇంగ్లండ్ క్రికెట‌ర్లు ఫైన‌ల్ ఆడి వెళ్లేవాళ్లు. వారు పాకిస్థాన్‌తో సిరీస్ ఆడుతున్నారు. పాక్ సిరీస్‌ లేకుంటే ఇంగ్లండ్ ఆటగాళ్లు వెనక్కి వెళ్ల‌రు" అని వాన్ అన్నాడు. 

అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌లో శనివారాల్లో డబుల్ హెడర్లు జరగని సందర్భాలు చాలా ఉన్నాయన్నాడు. గతంలో శని, ఆదివారాల్లో 4 గేమ్‌లు జరిగే విధంగా ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఉండేదని పేర్కొన్నాడు. కానీ ఈ సారి శనివారాల్లో డబుల్‌హెడర్‌లు ఎక్కువగా లేకపోవడంతో ఐపీఎల్ కాస్త సాగదీత‌గా మారింద‌ని తెలిపాడు. సీజన్‌ను పొడిగించకుంటే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తొందరగా నిష్క్రమించే వారు కాదని వాన్‌ వివరించాడు.

"పాక్‌తో సిరీస్ క్యాలెండర్‌లో ఉంది. భార‌త్‌లో జ‌రిగిన‌ 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ పేలవంగా ఆడింది. కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా జ‌ట్టును స‌రిగా న‌డిపించ‌లేక‌పోయారు. కాబట్టి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రోసారి ఇది పున‌రావృతం కాకుండా వారికి ఈ సిరీస్ దోహ‌ద‌ప‌డుతుంది. ఈ టోర్నీకి ఎంపికైన స్క్వాడ్ నుంచి ఒక మంచి జ‌ట్టుతో బ‌రిలోకి దిగ‌డానికి 5 టీ20ల సిరీస్ ఉప‌యోగ‌ప‌డుతుంది. జ‌ట్టు కాంబినేష‌న్స్‌ను ప‌రీక్షించ‌డానికి ఇది వారికి మంచి అవకాశాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను" అని వాన్‌ చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉంటే.. జోస్‌ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు), రీస్ టోప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) వంటి కీల‌క ఆట‌గాళ్లు పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ కోసం ఐపీఎల్‌ నుండి ముందుగానే వెళ్లిపోయారు. ఇవాళ్టి (మంగ‌ళ‌వారం) నుంచి పాక్‌-ఇంగ్గండ్ సిరీస్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News