Prajwal Revanna: ఏ తప్పూ చేయనట్టయితే భయమెందుకు? ఇండియాకు తిరిగి రా.. ప్రజ్వల్ కు కుమారస్వామి హితవు

Return To India HD Kumaraswamy Appeals To Nephew Prajwal

  • తిరిగి వచ్చి విచారణ ఎదుర్కోవాలంటూ సూచన 
  • కుటుంబం పరువు మర్యాదలు కాపాడాలన్న కర్ణాటక మాజీ సీఎం
  • సోదరుడి కుటుంబ వ్యాపారాల గురించి పెద్దగా తెలియదని మీడియాకు వివరణ

కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణకు ఆయన బాబాయ్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కీలక సూచన చేశారు. వెంటనే ఇండియాకు తిరిగి రావాలని హితవు పలికారు. ఏ తప్పూ చేయనట్టయితే భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈమేరకు హెచ్ డి కుమారస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు తమ కుటుంబ పరువు మర్యాదలకు మచ్చగా మారాయని చెప్పారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇండియాకు తిరిగొచ్చి, ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని ప్రజ్వల్ కు సూచించారు. కుటుంబ పరువు మర్యాదలను కాపాడాలని సోదరుడి కుమారుడికి చెప్పారు. 

సోదరుడు హెచ్ డి రేవణ్ణ కుటుంబం గురించి, ఆ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారాల గురించి తనకు పెద్దగా తెలియదని కుమార స్వామి చెప్పారు. కాగా, కర్ణాటకను కుదిపేసిన సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని, వారిపై అఘాయిత్యం చేస్తూ వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

ఎన్నికలకు ముందు పలువురు మహిళలతో ప్రజ్వల్ సన్నిహితంగా ఉన్న వీడియోల పెన్ డ్రైవ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో పలువురు మహిళలతో ప్రజ్వల్ రేవణ్ణ సన్నిహితంగా ఉన్న దాదాపు 3 వేల వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన తర్వాత నాలుగు రోజులకు ప్రజ్వల్ తన డిప్లమాటిక్ పాస్ పోర్ట్ సాయంతో జర్మనీ వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో దేవెగౌడ కుటుంబంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలోనే ఇండియాకు తిరిగొచ్చి విచారణను ఎదుర్కోవాలని ప్రజ్వల్ కు కుమారస్వామి సూచించారు.

  • Loading...

More Telugu News