Microplastics in Testicles: మనుషుల వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్స్.. సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం!

Microplastics Detected In Human Testicles Raising Fertility Concerns

  • యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో అధ్యయనంలో వెల్లడి
  • మనుషుల శాంపిల్స్‌లో బయటపడ్డ మైక్రోప్లాస్టిక్స్
  • పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్టు గతంలోనే వెల్లడి
  • ఈ పరిస్థితికి మైక్రోప్లాస్టిక్స్ కారణమేమో తేల్చేందుకు లోతైన అధ్యయనం జరగాలన్న శాస్త్రవేత్తలు

పురుషుల వృషణాల్లోనూ సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు (మైక్రోప్లాస్టిక్స్) ఉన్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. టాక్సికొలాజికల్ సైన్సెస్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో ప్రొఫెసర్ డా. జావ్‌జాంగ్ సారథ్యంలోని పరిశోధకుల బృందం శునకాలు, మనుషులపై ఈ అధ్యయనం నిర్వహించింది. 47 శునకాల శాంపిల్స్, 23 మనుషుల శాంపిల్స్‌ను పరీక్షించగా అన్నింట్లోనూ మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయి. ఈ పరిణామంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోప్లాస్టిక్స్‌తో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై  ప్రభావం గురించి లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

‘‘ఇటీవల కాలంలో పురుషుల సంతానోత్పత్తి కూడా తగ్గుతోంది. ఏదైనా కొత్త కారణం ఉండి ఉండొచ్చని నాకు అనిపించింది. దీంతో, ఈ అధ్యయనం చేపట్టాము’’ అని డా. జావ్‌జాంగ్ తెలిపారు.  మైక్రోప్లాస్టిక్ పునరుత్పత్తి వ్యవస్థల్లోకి చొరబడలేదని తాను భావించానని ఆయన తెలిపారు. తొలుత కుక్కల్లో మైక్రోప్లాస్టిక్స్ గుర్తించి ఆశ్చర్యపోయానని, పురుషుల పునరుత్పత్తి భాగాల్లోనూ ఇవి కనిపించడంతో ఆందోళన కలిగిందని చెప్పుకొచ్చారు. 

ఇందుగలడు అందులేడు అన్నట్టు సర్వత్రా వ్యాపించిన సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జీవవైవిధ్యం, ప్రకృతి సమతౌల్యాన్ని మైక్రోప్లాస్టిక్స్ దెబ్బతీస్తున్నాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది. అయితే, మనుషుల్లో సంతానోత్పత్తి తగ్గడం వెనక మైక్రోప్లాస్టిక్స్ కారణమా అని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు లోతైన అధ్యయనం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News