BJP: ఓటు వేయని బీజేపీ ఎంపీ.. పార్టీ షోకాజ్ నోటీసుల జారీ

BJP taken action against MP Jayant Sinha after he allegedly failed to cast his vote

  • పార్టీ కార్యకలాపాలు, ప్రచారంలో పాల్గొనకపోవడంపై ప్రశ్నించిన బీజేపీ
  • రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
  • సిట్టింగ్ స్థానం నుంచి మరొకరిని బరిలోకి దించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జయంత్ సిన్హా

సోమవారం జరిగిన ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా ఓటు వేయలేదు. ఈ ఎన్నికల్లో సీటు తనకు కాకుండా మనీశ్ జైస్వాల్‌కు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జయంత్ సిన్హా ఓటు వేయలేదు. అయితే ఎంపీగా ఉండి కనీసం ఓటు కూడా వేయకపోవడంపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఎంపీ జయంత్ సిన్హాకు షోకాజ్ నోటీసులు పంపించింది. 

పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని పార్టీ ప్రశ్నించింది. ‘‘హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించిన నాటి నుంచి పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కనీసం ఓటు వేయాలని కూడా మీరు భావించలేదు. మీ ప్రవర్తనతో పార్టీ ప్రతిష్ట మసకబారింది’’ అంటూ ఝార్ఖండ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహు నోటీసులో పేర్కొన్నారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సిన్హాను పార్టీ కోరింది. కాగా నోటీసులపై ఆయన ఇంకా స్పందించలేదు.

ఇదిలా ఉంచితే, లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ మార్చిలో జయంత్ సిన్హా ట్వీట్ చేశారు. ఆ కొద్దిసేపటికే హజారిబాగ్ బీజేపీ అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్ పేరుని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే ఈ జయంత్ సిన్హా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సీటు నుంచి ఆయన భారీ మెజారిటీతో గెలిచారు.

  • Loading...

More Telugu News