Pune Road Accident: కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన మైనర్.. నిందితుడికి బెయిల్ మంజూరుపై విమర్శలు

Furore over granting bail to minor in road accident which killed two people in pune

  • పూణెలో మే 19న ఘోర రోడ్డు ప్రమాదం
  • మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ యువ జంటను ఢీకొట్టిన మైనర్
  • బాధితులు ఘటనా స్థలంలోనే మృతి, బాలుడికి 14 గంటల్లోనే బెయిల్
  • కింది కోర్టు తీర్పుపై విమర్శల వెల్లువ 
  • ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు చేశామన్న పూణె కమిషనర్

పూణెలో అతివేగంతో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన మైనర్ బాలుడికి బెయిల్ మంజూర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేశామని పూణె పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. నేర తీవ్రత దృష్ట్యా నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. కాగా, మైనర్ బాలుడు పూణెలో ఓ ప్రముఖ బిల్డర్ కొడుకని తెలుస్తోంది. సదరు బిల్డర్ అధికార పార్టీకి సన్నిహితుడన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మే 19న ఈ ప్రమాదం జరిగింది. 
  
ప్రమాదం జరిగిన రోజు నిందితుడు తన స్నేహితులతో కలిసి ఓ బార్‌లో మద్యం తాగాడు. ఆ తరువాత తండ్రి పేరిట రిజిస్టరై ఉన్న కారులో తన స్నేహితులతో కలిసి బయలు దేరాడు. కారును అతివేగంగా నడుపుతూ తెల్లవారుజామున ఓ జంటను ఢీకొట్టాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతులను అనీశ్ అవధీయా, అశ్వనీ కోస్టాగా గుర్తించారు. 24 ఏళ్లున్న వారిద్దరూ ఐటీ రంగంలో పనిచేసేవారు. ప్రమాద సమయంలో కారు 200 కిలోమీటర్ల వేగంతో వెళుతోందన్న వార్తలు వెలువడ్డాయి.  

అయితే, ఘటన జరిగిన 14 గంటల్లోనే నిందితుడికి బెయిల్ మంజూర్ కావడం కలకలానికి దారి తీసింది. నేరం తీవ్రమైనది కాకపోవడంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అతడిపై కొన్ని షరతులు విధించింది. రోడ్డు ప్రమాదాలు, దాని పర్యవసానాలపై 300 పదాల వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి రద్దీ నియంత్రణలో పాల్గొనాలని, మద్యం అలవాటు నుంచి బయటపడేందుకు 15 రోజుల పాటు రిహాబిలిటేషన్ తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో స్పందించిన పూణె కమిషనర్ నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది దారుణమైన నేరం కావడంతో జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 2 ప్రకారం నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని తాము కోరగా కోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదం దారుణమైనదిగా నిరూపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News