YV Subba Reddy: సీఎం జగన్ పదవీప్రమాణ ముహూర్త సమయాన్ని వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy talks about CM Jagan oath taking ceremony

  • మే 13న ఏపీలో పోలింగ్ పూర్తి
  • జూన్ 4న ఎన్నికల ఫలితాలు
  • 150కి పైగా స్థానాల్లో వైసీపీ గెలుస్తుందన్న వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలపై స్పందించారు. మే 13న జరిగిన పోలింగ్ సరళి చూస్తే అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఓటేసేందుకు ఓపిగ్గా వేచిచూశారని... వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటేసిన తీరు ఆ రోజే వైసీపీ విజయాన్ని ఖాయం చేసిందని అన్నారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 175 స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు 150కి పైనే సీట్లు వస్తాయని తెలిపారు. 

"వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి విశాఖలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖలోనే పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంపై మా పార్టీ నేతలతో చర్చిస్తాం" అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.  

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మైనారిటీలు, బీసీలు, దళితులు, గిరిజనులు, మహిళలు వైసీపీ పక్షాన నిలిచారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మహిళలైతే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా, ఎండను కూడా లెక్కచేయకుండా ఓటు వేసేందుకు నిలబడ్డారని కొనియాడారు. 

సీఎం జగన్ పై మహిళలు చూపిస్తున్న ఆదరణ, కృతజ్ఞతకు అది నిదర్శనం అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా తీసుకువస్తే, మనకు లబ్ధి చేకూర్చుతున్న పథకాలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయి అనే నమ్మకం వాళ్లలో కనిపించిందని అన్నారు.

  • Loading...

More Telugu News