Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం వెనుక మొసాద్ హస్తం...?

Conspiracy theories behind Raisi death in helicopter crash
  • హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
  • ఇజ్రాయెల్, మొసాద్ ప్రమేయంపై అనుమానాలు!
  • ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో ఇరాన్ దేశం హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో సిరియాలో ఇరాన్ అత్యున్నత స్థాయి సైనిక జనరల్ ను ఇజ్రాయెల్ మట్టుబెట్టగా, ప్రతిగా ఇరాన్ భీకరస్థాయిలో ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. 

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఈ స్థాయిలో వైరం నడుస్తున్న దశలో... నిన్న ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ గురించి తెలిసినవారికి ఇలాంటి ఘటనలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు. 

ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. 

కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట! ఇజ్రాయెల్ తో పెట్టుకున్నవాళ్లు చచ్చిపోయారు కానీ, అందులో మొసాద్ పాత్ర ఇప్పటివరకు ఎక్కడా నిరూపితం కాలేదు. 

ఈ నేపథ్యంలో,  ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం పాలయ్యాక... అందరి దృష్టి ఇజ్రాయెల్ వైపు, మొసాద్ వైపు మళ్లింది. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ అధ్యక్షుడి మరణానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. 

అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ ఘటనలో మొసాద్ పాత్రను తోసిపుచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి వెనుక కుట్రకోణాలు ఉండకపోవచ్చని, అందుకు ఆధారాలేవీ లేవని అమెరికా సెనేట్ లో డెమొక్రాటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ చక్ షుమెర్ అన్నారు.
Ebrahim Raisi
Death
Helicopter Carsh
Iran
Mossad
Israel
Palestine
Hamas

More Telugu News